అది ఒకనాటి ఉషోదయం...శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయ ప్రాంగణంలో నేను. అవి ఇంటర్ కాలేజి లో లెక్చరర్ గా చేస్తున్న రోజులు. ఒక కుగ్రామంలో, అద్దె ఇంట్లో నా నివాసం. డైలీ ఆరేడు కిలోమీటర్లు కాలేజి కి ప్రయాణం. వేంగి చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఒక్క సారి స్వామి దర్శనం చేసుకోవడం తో మనసు ప్రాపంచిక విషయాలను మరచి మహా ప్రశాంతతను పొందుతుంది. మిఠాయి ప్రసాదం తింటుంటే, సెల్ ఫోన్ మోగింది, ఎవరబ్బా? అని చూస్తే ' ప్రియాంజలి '.
" హలో... చెప్పండి" అన్నాను.
" హలో... విరాజ్ గారేనా మాట్లాడేది? "
" ఔనండీ... నేనే... చెప్పండి?"
"మీరు, ఈసారి మన సభ్యుల తో కలిసి ' మహానంది క్షేత్రం ' వెళ్లాలండీ, మీటింగ్ కి...." ఇంకా వివరాలవీ చెప్పి ముగించింది. సరేననిచెప్పి ఫోన్ కట్ చేసాను.
కాలేజి లో ఇచ్చే ఆదాయం చాలక, ఈ ధార్మిక సంస్థ లో ఆర్నెల్ల క్రితం చేరాను. ప్రియాంజలి, ఈ సంస్థ లో కోఆర్డినేటర్. సభ్యులందరికీ ఫోన్లు చేయడం ఆమె భాధ్యత.
తర్వాత రెండు రోజులు శెలవు కనుక, కాలేజి నుండి ఇంటికి రాగానే " మహానంది" ప్రయాణం గురించి ఆరా తీస్తే, ఇంకా రెండు వారాలు సమయం పడుతుంది అని తెలిసింది. కొంచెం ఫ్రెష్ అయ్యి, భోజనం చేసిన తరువాత ' మహానంది ' గురించి ఆలోచించడం మొదలు పెడితే, నా ఇరవై తొమ్మిదేళ్ళ వయసు, గతకాలపు జ్ఞాపకాల్లో నికి తొంగి చూసింది.
అది శరదృతువు. దసరా శెలవులు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్. శెలవులు గడపడానికి, మా నాయనమ్మ వాళ్ల ఊరికి వెళ్ళాను. ఆత్రేయ గోదావరి తీరాన ఉన్న పల్లెటూరు అది. అక్కడ మాకు లంకల్లో పొలాలు, చేలు కూడా ఉన్నాయి.
మామిడికాయలు చిలుకలు, పిట్టలూ పాడు చేస్తున్నాయి, ఊరగాయ పెట్టవచ్చు కోయమని , నాయనమ్మ తెగ పోరుతూంటే... చెట్టెక్కాను కోద్దామని,..వంద కాయలు పైగానే వుంటాయి కోసినవి, ఇక చాలులే, దిగు దిగు అంటూ నాయనమ్మ కాయలు తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది.
గుబురుగా దట్టంగా పెరిగిన ఆ మామిడి చెట్టు కొమ్మల్లో నేను ఉన్నానంటే ఎవరికీ తెలియదు. అబ్బ ఎంత చల్లగా ఉంది అనుకుంటూ ఉంటే, ఏదో చప్పుడు అయ్యింది. అది వెనకింటి తడికల స్నానాలగది. కొబ్బరి తడికను... ముందుకు నెట్టి ,ఆ గదిలో కి వచ్చిన ఆ అమ్మాయి ని చూసి షాక్ అయ్యాను. తను" లావణ్య" . నా జూనియర్. తను ఇక్కడ?! ఈ ఊర్లో!..మా వెనక ఇంటి లోనే! సవాలక్ష ప్రశ్నలు సందేహాలు చుట్టుముట్టాయి!



